నారాయణ దాసుగారు తన పంథొమ్మిదవ ఏట హరికధా ప్రదర్సనలతో సమాంతరంగా అవధాన ప్రక్రియ
ప్రదర్సన కూడా మొదలు పెట్టారు. అయితే అయన అష్టావధానాలు తక్కిన వారి అష్టావధానాలకు భిన్నంగా, అయన సంగీత సాహిత్య ప్రతిభకు, బహుభాషా పాండిత్యానికి దర్పణాలుగా ఉండేవి. ఉదాహరణకు, అయన అష్టావధానాలలో వ్యస్తాక్షరి గ్రీకు భాషలో ఉండేది.
నారాయణ దాసుగారు బందరులో పంతులుగారి మేడమీద ప్రదర్శించిన అష్టావధానం ప్రవేశ రుసుముతో
జరిగింది. ఈ అష్టావధానం 1888-89 లో వారు కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, బందరులలో సాగించిన సాహిత్య
యాత్రలో భాగంగా ప్రదర్శించారు. సంగీతానికి సంబంధించిన అంశాలు అందులో ఉండడం దాని ప్రత్యేకత. రెండు పాదములతో రెండు తాళములు, రెండు చేతులతో రెండు తాళములు వేసి పల్లవి పాడుచూ కోరిన జాగాకు ముక్తాయిలు వేయుట, నలుగురకు తెలుగున, నలుగురకు సంస్కృతమున కోరిన పద్యములు కవిత్వము చెప్పుట, వ్యస్తాక్షరి, న్యస్తాక్షరి, గణిత
శాస్త్ర సమస్యను సాధించుట, పూలు, గంటలు లెక్కించుట, ఛందస్సంభాషణ, ఇంగ్లీషులో ఉపన్యాసము మొదలైనవి, ఆ అష్టావధానంలో అంశాలు.
శ్రీ పెద్దింటి సూర్యనారాయణ దీక్షిత దాసుగారు యక్షగాన రూపంలో రచించిన “నారాయణ దాస జీవిత చరిత్ర” లో నారాయణ దాసుగారి సంగీత / అసాధ్య అష్టావధానాన్ని
ఈ విధంగా వర్ణించారు:
ఇరు హస్తములతోడ జెరియోక తాళంబు
చరణద్వయాన నేమరక రెండు
పచరించి, పల్లవిబాడుచు గోరిన
జాగాకు ముక్తాయి సరిగా నిడుట
నయమొప్ప న్యస్తాక్షరియును వ్యస్తాక్షరి
ఆంగ్లంబులో నుపన్యాస, మవల
నల్వురకున్ దెల్గునన్ నల్వురకు సంస్కృ
తంబున వలయు వృత్తాల గైత,
సంశయాంశంమ్ము శేముషీ శక్తితో బ
రిష్కరించుట, గంటలు లెక్కగొంట
మరియు ఛందస్సుతోడి సంభాషణంబు
వెలయు నష్టావధానంబు సలిపె నతడు
[నారాయణ
దాసు గారు అష్టావధానం చేసిన మరునాడు, ‘బుధవిదేయిని’ అనే స్థానిక
పత్రిక ఆ అవధానం గురించి వ్యంగ్యంగా బ్రహ్మశ్రీ ఆదిభట్ల నారాయణ దాసుగారు ‘చిన్నపనులగుంపు చేసేరు’ అని వ్రాసింది.
నారాయణ దాసుగారు దానికి తీవ్రంగా స్పందిస్తూ, ‘కలుషహారిణి’ అనే ఇంకొక
స్థానిక పత్రికలో ఇలా ప్రకటన ఇచ్చారు: “నారాయణ దాసుగారు
చేసినది అసాధ్య అష్టావధానము, సంగీత సాహిత్యములలో ఇట్లవధానములు చేయు సమర్ధత ఇంకోక్కనికుండుట దుర్ఘటమని ఏల
వ్రాయకూడదు; నా అష్టావధానము గ్రహించి వ్రాయుటకు కేవల సాహిత్యజ్ఞుడగు
బుధవిదేయిని ప్రకటనకర్త సమర్ధుడు కాదు; పైగా నా ప్రతికక్షులలో
చేరియుండుటచే అట్లు వ్రాసెను.” ఆ ప్రకటనతో ‘బుధవిదేయిని’, ‘కలుషహారిణి’ పత్రికల మధ్య
పెద్ద వివాదమే చెలరేగింది. నారాయణ దాసుగారి సమర్ధకులు, ప్రత్యర్ధులు ఇరువైపులనుండి వ్యాసపరంపరలతో పోట్లాడుకున్నారు.
చిలికి చిలికి గాలివాన అయినట్లే ఒక పెద్ద సాహిత్య దుమారమే చెలరేగింది.
ఈలోగా, అంతకుముందు పల్లవి ప్రదర్శనలో పరాజితులైన దాసుగారి ప్రతికక్షులు
సంగీతంలో ఆయనను ఓడించాలనే ఉద్దేశంతో ఒక సభ చేసి,చేతనయితే అందులో వారితో పోటీకి రావాల్సిందిగా వర్తమానం
పంపేరు. నారాయణ దాసుగారు ఆ సవాలును స్వీకరించి ఆ సభకు
హజరయ్యారు. అయన హుందాగా సభలో ప్రవేసించినంతనే ‘బ్రావో’ అనే హర్షధ్వానాలు
మిన్నుముట్టేయి. ఆ సభకు అధ్యక్షత వహించిన నారాయణ దాసుగారి ప్రత్యర్ధి (ఒక
వకీలు), “నారాయణ దాసుగారు ఇక్కడ ఉన్న ఇరవై మంది సంగీత విద్వాంసులు
విద్యయందు తమకు చాలరని ప్రకటించినందుకే ఈ పోటీ సభ నిర్వహించబడింది. కనుక వీరు
వేయు ప్రశ్నలకతను సమాధానము చెప్పవలెను. ఈ శాస్త్ర పరీక్షలో అతను
నెగ్గినచొ అతడందరికన్నా గొప్ప సంగీత విద్వాంసుడని అంగీకరించబడును. లేనిచో
అతడు అందరికి క్షమాపణ చెప్పవలెను” అన్నారు
.అప్పుడు నారాయణ దాసుగారు లేచి “సభికులారా, ఈ విద్వాంసులందరూ సంగీతమున నాకు లోకువయని వీరలు నన్ను
తిరస్కరించినపుడెల్ల నేనన్నమాట నిజమే. సంగీత విద్వాంసులమనుకొన్నవారిలోనే సంగీత
తత్వము తెలిసినవారుంట అరుదన తక్కినవారి గురించి చెప్పనేల? కావున మాకు మధ్యస్థులై మీరు ఉండుట అసాధ్యము. ఇప్పుడు వీరు సంగీత
శాస్త్రమున నన్ను పరీక్షించుటకు అనర్హులు. కారణమేమన సంస్కృతభాష కొంచెమైనను వీరికి
తెలిసినట్లు కాన్పించదు. సంస్కృత భాషాజ్ఞాన మిసుమంతయులేని వారికి సంస్కృతమున
వ్రాయబడిన సంగీత శాస్త్రమన్వయింప బడదు కదా? కావున సంగీత శాస్త్రములోని సూత్రములు కాని పద్యములు కాని నేను చదివితే వీరికి
అర్ధమే కాదు. కనుక శాస్త్ర చర్చ నాతొ చేయుటకు వీరు తగరని స్పష్టము. ఇక ‘శ్రోతృరంజక
స్వరసందర్భము’ సంగీతము. కనుక వీరందరును కలిసి ఒక గంట పాడనిండు. పిదప
నేను ఒక గంట పాడెదను. ఎవరి పాట మిక్కిలి రంజకముగా ఉండునని మీకు తోచునో
వారధికులుగ నిర్ణయింపబడుడురు. ఇది నా మనవి” అన్నారు.
అప్పుడు సభాధ్యక్షులు లేచి, “ఉభయుల వాదనలు విన్నాము. శాస్త్ర వాదమగునప్పుడు తగువు తీర్చుటకు
మేమనర్హులము. ఉభయ కక్షల వారు పాడి సభారంజకమొనర్చుట మా కోరిక” అన్నారు. అందుకా ప్రతికక్షులు “మీ అందరికి రక్తి చేయుటకు ఈ సభ నిర్వహించబడలేదు” అని ఇంకా వారి అక్కసు అంతా వెళ్ళగక్కేరు. దానికి నారాయణ
దాసు గారి శిష్యుడొకడు దీటైన సమాధానం ఇచ్చేడు. రణగొణధ్వనుల మధ్య సభ
ముగిసింది.
బందురులో
నారాయణ దాసుగారి ప్రతికక్షులలో ముఖ్యుడు హరి నాగభూషణం గారనే సంగీత విద్వాంసుడు.
నారాయణ దాసుగారి పత్రికా ప్రకటనకు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేసి వ్యాస పరంపరల
యుద్ధం మొదలు పెట్టింది ఆయనే. ఇంత జరుగుతున్నా నారాయణ దాసుగారు అందులో జోక్యం
చేసుకోలేదు. అలా కొన్ని నెలలు సాగిన యుద్ధం చివరకు చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారి
జోక్యంతో ముగిసింది. నాగభూషణం గారు ‘ఉపసంహారం’ అనే పేర బుధవిదేయిని పత్రికలో వ్రాసిన వ్యాసంతో
డొంకతిరుగుడుగా క్షమాపణ చెప్పారు. బుధవిదేయిని పత్రిక సంపాదకులు
పురుషోత్తమ రావు గారు తమ కుమారుని నారాయణ దాసు గారింటికి పంపారు. ఆ అబ్బాయి నారాయణ
దాసుగారిని కలిసి'మా నాన్నగారు నమస్కారాలు తెలపమన్నారు' అని తెలిపాడు. ఆ కధ అంతటితో సుఖాంతం అయింది. అయితే దానికి
కొసమెరుపు లేక పోలేదు. అప్పటికి కొన్ని దశాబ్దాల తరువాత అంటే 1932 లొ బందరు
పట్టణంలో హరి నాగభూషణం గారే అధ్యక్షత వహించిన సంగీత విద్వాంస సభలో నారాయణ దాసుగారి
స్వరాక్షర కృతులను ఆచార్య పి. సాంబమూర్తి ప్రభ్రుతులు ఎంతో కొనియాడారు. ఆచార్య
సాంబమూర్తిగారు 15-9-1932 న వ్రాసిన లేఖను బట్టి దాసుగారు 1927 లో మదరాసులో జరిగిన
అఖిల భారత సంగీత పరిషత్తు ప్రారంభోత్సవ సభలో కొన్ని లోకోత్తరములైన స్వరాక్షర
కృతులను గానం చేసినట్లు తెలుస్తున్నది.]