Sunday, October 13, 2019

అచ్చతెలుగు సీసపద్యపు సొగసు


మిశ్రమ తెలుగులో నారాయణ దాసు గారు రచించిన సీస పద్యాల సౌందర్యవైనము ఈ బ్లాగులో ఇంతకుముందు ప్రచురించిన రెండు మూడు లఘు వ్యాసాలలో ప్రస్తావించాము. ఆయన రచించిన అచ్చతెలుగు సీసపద్య సౌందర్యము దీనిలో చూడవచ్చు: 

నిప్పుల కుప్పయ్యనే యలరుల పాన్పు
                  మేనుడికించె దెమ్మెర చెలంగి
పట్టదు కూరుకు కిట్టదు బువ్వ, యే
పని సల్పుటకునైన బాలుపోవ
దుల్లముఁ మఱపింప నుగ్మలుల్ కావించు
నిమ్ము కిడుముడి యిన్మఢించె
నేవైపు గాంచిన నీవె కన్నుల గట్టి
నట్లుంటి విందొక నాగె నుసురు
మాటి కచ్చిక బుచ్చిక మాటలాడి
మరులు పుట్టించి తగులము మప్పి మఱల
జెచ్చెరన్వచ్చెదనటంచు నచ్చజెప్పి
యేల రావైతి వింగ వీడ్కోలు గొంగ

(గౌరి మహేశునికై చెందిన విరహ ఘట్టము లోనిది ఈ పద్యముఅచ్చతెలుగు హరికథ, గౌరప్ప పెండ్లిపు. 16)  

Friday, January 11, 2019

అసాధ్య / సంగీత అష్టావధానం


నారాయణ దాసుగారు తన పంథొమ్మిదవ ఏట హరికధా ప్రదర్సనలతో సమాంతరంగా అవధాన ప్రక్రియ ప్రదర్సన కూడా మొదలు పెట్టారు. అయితే అయన అష్టావధానాలు తక్కిన వారి అష్టావధానాలకు భిన్నంగా, అయన సంగీత సాహిత్య ప్రతిభకు, బహుభాషా పాండిత్యానికి దర్పణాలుగా ఉండేవి.  ఉదాహరణకు, అయన అష్టావధానాలలో వ్యస్తాక్షరి గ్రీకు భాషలో ఉండేది. నారాయణ దాసుగారు బందరులో పంతులుగారి మేడమీద ప్రదర్శించిన అష్టావధానం ప్రవేశ రుసుముతో జరిగింది. సంగీతానికి సంబంధించిన అంశాలు అందులో ఉండడం దాని ప్రత్యేకత.  రెండు పాదములతో రెండు తాళములు, రెండు చేతులతో రెండు తాళములు వేసి పల్లవి పాడుచూ కోరిన జాగాకు ముక్తాయిలు వేయుట, నలుగురకు తెలుగున, నలుగురకు సంస్కృతమున కోరిన పద్యములు కవిత్వము చెప్పుట, వ్యస్తాక్షరి, న్యస్తాక్షరి, గణిత శాస్త్ర సమస్యను సాధించుట, పూలు, గంటలు లెక్కించుట, ఛందస్సంభాషణ, ఇంగ్లీషులో ఉపన్యాసము మొదలైనవి, ఆ అష్టావధానంలో అంశాలు. శ్రీ పెద్దింటి సూర్యనారాయణ దీక్షిత దాసుగారు యక్షగాన రూపంలో రచించిన నారాయణ దాస జీవిత చరిత్ర లో నారాయణ దాసుగారి సంగీత / అసాధ్య అష్టావధానాన్ని ఈ విధంగా వర్ణించారు:

ఇరు హస్తములతోడ జెరియోక తాళంబు
చరణద్వయాన నేమరక రెండు
పచరించి, పల్లవిబాడుచు గోరిన
జాగాకు ముక్తాయి సరిగా నిడుట
నయమొప్ప న్యస్తాక్షరియును వ్యస్తాక్షరి
ఆంగ్లంబులో నుపన్యాస, మవల
నల్వురకున్ దెల్గునన్ నల్వురకు సంస్కృ
తంబున వలయు వృత్తాల గైత,
సంశయాంశంమ్ము శేముషీ శక్తితో బ
రిష్కరించుట, గంటలు లెక్కగొంట
మరియు ఛందస్సుతోడి సంభాషణంబు
వెలయు నష్టావధానంబు సలిపె నతడు