Monday, October 13, 2014

కలివశంబున శారద కలుషయయ్యె| బిదపకాలంబున దలంపు పిచ్చియయ్యె|

నారాయణ దాసు గారు సంస్కృతంలో ప్రబంధ సాహిత్యం రచించారు; ఎంతోక్లిష్టమైన భుజంగవృత్తంలో రామచంద్ర శతకం రచించారు. పాణిని వ్యాకరణ సూత్రాలకు అనుబంధంగా చదువుకోడానికి అనువుగా 'తారకం' అనే కావ్యాన్ని రచించారు. అయినా అయన ఆంధ్ర భాషాభిమానం ఈ పద్యం రూపంలో వెలువడింది:

మొలక లేతదనము, తలిరుల నవకంబు
మొగ్గ సోగతనము, పూవు తావి
తేనె తీయదనము తెలుగునకే కాని
మొరకు కరకు దయ్యపు నుడికేది?

హరికథ సృష్టి నారాయణ దాసు గారికి ఒక వరం, ఒక శాపం కూడ. ఎందుకు అంటే సంగీత, సాహిత్యాలలో; అష్టావధానం, శాస్త్రీయసంగీత ఆలాపన వంటి ప్రదర్శన కళలలో అయన సాధించిన అనేక విజయాలను, హరికథ మరుగున పడేలా చేసింది. అయితే అయన మానవ జాతికి భక్తి, జ్ఞాన, మోక్ష మార్గములను ప్రబోధించాలనే లక్ష్యంతో ఎంచుకున్న హరికథను వేలాది సభలలో ప్రదర్శించి, లక్షలాది భక్తుల హృదయాలలో నర్తించి, నివసించారు.  హరికథ సర్వ కళల సమాహారం. అందులో అయిదు ప్రధాన అంశాలు ఉండేవి. అవి కథా ప్రవచనము, శాస్త్రీయ సంగీతము, ఆశుకవిత్వము, నృత్యము, అభినయము. ఈ అయిదు అంశాలూ లేకపోతే హరికథ చెప్పకూడదా అనే ప్రశ్న రావచ్చును. ఆ అయిదు అంశాలతో హరికథ చెప్పాలంటే బహుశా మళ్ళీ నారాయణ దాసు గారే పునర్జన్మ ఎత్తాలేమో! హరికథ చెప్పడానికి ప్రాధమిక అర్హతలు శ్రావ్యమైన కంఠం, చక్కని ప్రవచన శక్తి. నారాయణ దాసు గారి హరికథలో మిగతా మూడు అంశాలు పక్కన పెడితే, ఈ రెండింటిని సాధనతో పెంపోదించుకోవచ్చు. సందర్భోచితమైన రాగాలలో సంగీతం ఆలపించడానికి శాస్త్రీయ సంగీత అధ్యయనం, క్రమం తప్పని సాధన కావాలి. అలాగే పురాణేతిహాసాలను చదివినకొద్దీ ప్రవచన శక్తికి ధాటి, ధీటు పెరుగుతాయి.  

నారాయణ దాసు గారు తన సంగీత, సాహిత్య జైత్ర యాత్రలో అనేక పరీక్షలను ఎదుర్కొన్నారు. అయితే వాటిని తన సహజ సాహితీ, పాండిత్య ప్రతిభతోనూ, శ్రావ్యమైన, మేఘగంభీరమైన అమరగానంతోను అధిగమించి ఉన్నత శిఖరాలను చేరుకోగలిగారు. అలాంటి మొదటి పరీక్ష, అంబరీష చరిత్రము రచన. ఆ రోజుల్లో తన మొదటి రచన, ప్రదర్శన అయిన 'ధ్రువచరిత్రము' నకు విశేష పండితాదరణ లభించడంతో ఆ హరికథను ప్రదర్శిస్తూ శ్రీకాకుళం, గంజాం (ఒదిషా) జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఛత్రపురంలో కథా ప్రదర్శన పూర్తయిన తరువాత ఒక సభికుడు లేచి 'ఇంతటి సొగసైన కవిత్వం ఈ వయసులోనే నువ్వు రాసేవంటే నమ్మశక్యం కావడం లేదు. ఇది నువ్వే నిజంగా రచించినట్లయితే 'అంబరీష చరిత్రము' ను రచించి చూపించు. నీకు పది రోజులు గడువిస్తాను' అన్నాడుట. అయితే నారాయణ దాసు గారు రాత్రికి రాత్రే  'అంబరీష చరిత్రము' ను రచించి మర్నాడు ప్రదర్శించేరుట. అది ఆయన రచించిన రెండవ హరికథ. అప్పటికి ఆయనకు ఇరవై ఏళ్ళు. విచిత్రమేమిటంటే అంత చిన్న వయసులో రచించిన అంబరీష చరిత్రములో అయన వెలువరించిన వేదాంత భావాలు ఎంతో పరిణత చెందిన తరువాత రచించిన సర్వపురాణ సారమైన జగజ్జ్యోతిలో విస్తారంగా కనిపిస్తాయి.

అలాగే అయన ఒక ఊళ్ళో హరికథ చెప్పడానికి ఉపక్రమిస్తుంటే సభలోంచి ఎవరో లేచి ఎప్పుడూ హరికథేనా, ఈరోజు గిరికథ చెప్పండి అని అడిగారట. అయన అప్పటికప్పుడు గోవర్ధనోద్ధారము అనే హరికథను ఆశువుగా రచించి చెప్పేరట. నారాయణ దాసు గారి హరికథా ప్రదర్శనలు రాత్రి తొమ్మిది గంటలకు మొదలు పెడితే తెల్లారే వరకు అంటే సుమారు తొమ్మిది గంటలు నడిచేవి. ఆశువుగా రచించి, అన్ని గంటలు హరికథ చెప్పడం అంటే ఆ కవికి ఎంత సంగీత, సాహిత్య ప్రతిభ ఉండాలో ఆలోచించండి. 

నారాయణ దాసు గారికి ఎనిమిదేళ్ళ వయసులో వారింటికి ఒక సంగీత విద్వాంసుడు రావడం జరిగింది.  అయన ఆ పిల్లవాడు రాగయుక్తంగా పద్యాలు పాడుతుంటే విని సంతోషించి, అతని తల్లిదండ్రులతో ఈ పిల్లవానికి శ్రావ్యమైన కంఠం ఉంది. సంగీత శిక్షణ ఇప్పిస్తే మంచి విద్వాంసుడవుతాడు; నాతొ బొబ్బిలి పంపండి సంగీత శిక్షణ ఇప్పిస్తాను అన్నాడు. నారాయణ దాసు తనలో, శిష్యరికం పేరుతొ నన్ను జీతం బత్తెం లేని పనివాడుగా వాడుకోడానికి తీసుకు పోతున్నాడు అనుకున్నాడుట. అంటే అ వయసుకే ఆయనకు కొంత ఆత్మజ్ఞానం, ఏ గురువు శిక్షణ లేకుండానే విద్యలు నేర్చుకోగలననే ఆత్మవిశ్వాసం ఉండి ఉంటాయి. అయితే అది అతిశయోక్తి కాదు అనే విషయం ఆయన బొబ్బిలి వెళ్ళగానే ఋజువయింది. ఆయన కోట వీధిలో గొంతెత్తి పాడుకుంటూ వెళుతున్నాడు. అక్కడ ఒక అరుగు మీద కూర్చున్న ఒక వృద్ధుడు అతనిని దగ్గరగా పిలిచి, బాబూ చక్కగా పాడుతున్నావు; నువ్వు పాడుతున్నదేరాగమో నీకు తెలుసా?’ అని అడిగేడట. దానికి ఆపిల్లవాడు నాకు రాగాలేవి తెలియవండి అని సమాధానం ఇచ్చాడట. అ పెద్దాయన తన పక్కనున్న వారితో, చూసారా, శుభపంతువరాళి రాగాన్ని ఎంత చక్కగా పాడుతున్నాడో! జన్మాంతర సుకృతం లేకుండా ఇలాంటి సంగీతం అలవడదు; ఈపిల్లవాడు మంచి సంగీత విద్వాంసుడవుతాడు’, అని దీవించి పంపేడట. ఆ పిల్లవాడు పాడుతున్న కీర్తన అప్రయత్నంగానే ఎంతో సాధనచేస్తేనేగాని పట్టుపడని అంత క్లిష్టమైన రాగక్రమంలో వెలువడిందీ అంటే అది దైవానుగ్రహమైన విద్యగానే భావించాలి.      

బెంగుళూరులో, 1894లో జరిగిన దాక్షిణాత్య గాయక మహాసభలో హరికథా ప్రవచనానికి దాసు గారికి ఆహ్వానం వచ్చింది. అప్పటికే నారాయణ దాసు గారికి కవిగా, గాయకుడుగా, హరికథా ప్రవక్తగా దక్షిణాపథం అంతా మంచి పేరు వచ్చింది. అందుచేత సభా నిర్వాహకులు అయన స్థాయికి తగ్గట్టుగా పేరుపొందిన మృదంగ, వయోలిన్ విద్వాంసులను ప్రక్క వాద్యాలకు నియమించారు. అయితే, దాసుగారి ప్రతిభ గురించి తెలియని ఆ మృదంగ విద్వాంసునికి ఒక హరిదాసుకి ప్రక్క వాద్యం వాయించడం చిన్నతనంగా తోచింది.  అందుచేత నారాయణ దాసు గారిని పడగొట్టి తన పాండిత్య ప్రతిభను చాటుకోవాలనుకున్నాడు. తాను ప్రక్క వాద్యకారుడుని అనే విషయం విస్మరించి, ఆయన కీర్తన మొదలు పెట్టీ పెట్టగానే, ఇంకా రాగం ఎత్తుకోకుండానే తాను వాయించడం చెయ్యసాగాడు. కొంతసేపు ఓర్పు వహించిన దాసుగారు అతనికి గుణపాఠం చెప్పే సమయం వచ్చిందనుకుని ఒక గతిలో కీర్తన పాడుతూ ఇంకొక గతిలో చేతిలో చిడతలతో తాళం వెయ్యసాగేరు. అ విద్వాంసుడు కొంత సేపు గాత్రం తోనూ, కొంతసేపు చిడతల తాళం తోనూ తికమకపడి ఇంక లాభం లేదనుకుని చేతులు ముడుచుకు కూర్చున్నాడు. అప్పుడు దాసుగారు ఏం స్వామీ ఆపేసేరు?’ అని అడిగేరుట. అప్పుడు ఆ వాద్యకారుడు 'అయ్యా, జాగా దొరకడం లేదు అన్నాడుట'.  అప్పుడు దాసుగారు ఆ వాద్యకారుని మందలించి జాగా వెల్లడి చేసి తన ప్రవచనాన్ని కొనసాగించేరు. మూడు గంటలసేపు ఎంతో రసవత్తరంగా హరికథ జరిగింది. అయితే ఈ కథ ఇక్కడితో ముగిసిపోలేదు. దాక్షిణాత్య గాయక మహాసభ ఆఖరిరోజున నారాయణ దాసు గారికి ఘనమైన సన్మానం చేసి లయబ్రహ్మ అనే బిరుదును ప్రదానం చేసింది.  అంటే 'లయబ్రహ్మ' అనే బిరుదు నారాయణ దాసు గారి శిష్యులో, భక్తులొ మొక్కుబడిగా ఇచ్చిన బిరుదు కాదు. అది ఆనాటి దక్షిణ భారత దేశంలోని ప్రతిభావంతులైన సంగీత విద్వాంసులందరూ ఏకగ్రీవంగా తీర్మానించుకుని తమ భక్తి, గౌరవాలకు, ప్రశంసలకు ఇచ్చిన సంక్షిప్త సంకేత రూపం.

నారాయణ దాసు గారు తెలుగులో పదిహేడు, సంస్కృతంలో మూడు, అచ్చతెలుగులో ఒకటి మొత్తం ఇరవైఒక్క హరికథలు రచించేరు. డెబ్భైరెండు మేళకర్త రాగాలలోను కీర్తనలు రచించిన వాగ్గేయకారుడు  త్యాగరాజు తరువాత నారాయణ దాసే. జానకీ శపథం అనే హరికథలో నారాయణ దాసు గారు ముప్ఫై ఆరు అపూర్వ రాగాలలో కీర్తనలు రచించారు. ఆ హరికథను నారాయణ దాసు గారి తరువాత ఇంతవరకూ ప్రదర్శించిన వారు లేరు.

ఆయన యధార్ధ రామాయణంఅనే ఆరు రామాయణ హరికథల సంపుటికి రచించిన ముప్ఫై పేజీల ఉపోద్ఘాతంలో ముఖ్య పాత్రల చిత్రణను వివరించేరు. అందులో శ్రీరామునిని వర్ణించడానికి వాడిన విశేషణాలు మూడు పేజీలు. ఆధునిక విమర్శకులు తెరపైకి రావడానికి కొన్ని దశాబ్దాలకు ముందే, వారు ఈనాడు ఎత్తి చూపుతున్న అసమంజసాలను నారాయణ దాసు గారు తన యధార్ధ రామాయణంలో సంస్కరించారు. అందుకు అయన ఆధ్యాత్మ రామాయణాన్ని ప్రమాణంగా ఎంచుకున్నారని పండితులంటారు. నారాయణ దాసు గారి రామాయణ కథలో అహల్య శాప వృత్తాంతం విభిన్నంగా ఆమె పాత్ర ఉదాత్తతను తెలియచేప్పేదిగా ఉంటుంది. వాలిని చెట్టు చాటునుంచి వధించడం ఉండదు. సీతకు శీల పరీక్షా ఉండదు. మనం చదువుతున్న రామాయణ కధలలోని ఈఘట్టాలన్నీ వాల్మీకి కల్పనలు కావని, ప్రక్షిప్తాలని  నారాయణ దాసు గారి అభిప్రాయం. ఈ గ్రంధాన్ని అయన 1914 లో రచించి, దివంగత అయిన తన భార్యకు అంకితం ఇచ్చారు. 

నారాయణ దాసు గారికి సీస పద్య వృత్తం అంటే ప్రత్యేక అభిమానం. ఎందుకంటే భాషా సౌందర్యానికి, భావ వ్యక్తీకరణకి సీసంచక్కని వాహిక. ‘రుక్మిణి కళ్యాణం హరికథలోని ఈ సీస పద్య సౌందర్యాన్ని ఆస్వాదించండి!

దుర్వాంకురంములతో సన్నజాజులు
                   మొగలిరేకులు జారుసిగను జుట్టి 
తళుకుజెక్కుగులాబిదంతము నిగనిగ
                   రవలకమ్మలజోడు జెవులబెట్టి   
లేతప్రాయపు బిగిచేతిగాజులు, రైక
                   యొడ్డాణమున్వెలియుడుపుగట్టి
ముద్దుమొగంబున ముత్తయిదుచిన్నెల
                   నంబపేరిట నోగిరంబు వట్టి

వెన్నెలలు చీకటులు బర్వు కన్నుదోయి
ముత్తెముల్కెంపులొల్కెడి ముద్దువాయి
నందమగు రుక్మిణికన్య యలరు హాయి
చాటిజెప్పగ వేయినోళ్ళు చాలవోయి

'దేవుళ్ళు ఎలా ఉంటారో మనం చూసేమా? మనలాగే ఉంటారని ఊహించుకుని పూజించుకుంటాం' అని పైన పేర్కొనిన యధార్ధ రామాయణం ఉపోద్ఘాతంలో అంటారు శ్రీ దాసు గారు. దాసు గారు వర్ణించిన రుక్మిణి నవవధువుగా అలంకరించబడ్డ తెలుగింటి ఆడపడుచే! అ కవిత్వం ఎంత సొగసుగా ఉందో అంత సుళువుగానూ అందరికీ అర్థం అయ్యేలా లేదూ? ఇంత సొగసుగా కవిత్వం చెప్పిన శ్రీ నారాయణ దాసు గారు సందర్భాన్నిబట్టి అదే కవిత్వాన్ని పదునైన కత్తిలా కూడా ప్రయోగించేవారు. ఆయన హరికథా గానం చేసిన సభలు శాస్త్ర, సంగీత చర్చలకు, సాహిత్య విమర్సలకు సభావేదికలయ్యేవి. ఆనాటి ఆధునిక కవులను విమర్శించిన ఈ క్రింది పద్యం అయన ఒక వేదికపై ప్రహ్లాద చరిత్ర హరికథ చెప్తున్నప్పుడు ఆశువుగా చెప్పినది:

పూర్వప్రబంధము పోల్కికై చచ్చిన
         యీగనంటించెడు హీనుడొకడు
ప్రౌఢకల్పనలని పన్ని తనకుదానె
          యర్ధంబెరుగలేని వ్యర్దుడొకడు
కృతిని నిఘంటువు వెతకి ముదురు తాటి
          ముంజెవలెన్ జేయు మూర్ఖుడొకడు
తేట తెల్లంబని తెన్గుబాసకు బట్ట
          తెరచి చూపించెడి దేబె యొకడు

కలివశంబున శారద కలుషయయ్యె
బిదపకాలంబున దలంపు పిచ్చియయ్యె
అచ్చుచవకయ్యె మూఢులు మెచ్చుటయ్యె
ఆహహా! ఎందుకు కవులైరి యాధునికులు?

అయితే కవితాదార ఎలా ఉండాలి? నారాయణ దాసు గారి దృష్టిలో సహజ కవిత:

సాగి కమ్మెచ్చునన్ వచ్చు తీగకరణి
సాలెపురుగు కడుపులోని నూలువలెను
దబ్బునన్ బొర్లిపడు గొండధారమాడ్కి
సహజకవిత బయల్వెడి సన్నుతిగను  

నారాయణ దాసు గారు మనకు అందించిన అద్భుతమైన, అనన్యసామానమైన, అనితరసాధ్యమైన  సాహిత్య సంపదను ఆస్వాదించి ముందుతరాలకు అందించడం మన కర్తవ్యం.

No comments:

Post a Comment